చండీగఢ్: దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది కాలుష్యంపై వివాదం కొనసాగుతున్నది. ఈ జలాల్లో అమోనియా ఎక్కువగా ఉందని, నీరు విషపూరితం కావడానికి హర్యానా కారణమని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం నయాబ్ సైనీ యమునా నదిలోని నీటిని తాగారు. బుధవారం హర్యానా, ఢిల్లీ సరిహద్దులోని పల్లా గ్రామం వద్ద యమునా నది ప్రవాహంలోని నీటిని దోసిళ్లలోకి తీసుకుని తాగారు. ఆ తర్వాత ఆ నీటిని తన తలపై చల్లుకున్నారు.

కాగా, ఎలాంటి అనుమానాలు లేకుండా యమునా నది నీటిని తాను తాగినట్లు హర్యానా సీఎం నయాబ్ సైనీ తెలిపారు. ‘ఢిల్లీ సీఎం అతిషి రాలేదు. ఆమె కొత్త అబద్ధాన్ని సృష్టిస్తుండాలి. కానీ అబద్ధాలకు కాళ్ళు లేవు. అందుకే ఆప్-డా అబద్ధాలు పనిచేయడం లేదు’ అని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు.
మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మనస్సులలో భయాన్ని సృష్టించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని హర్యానా సీఎం సయాబ్ సైనీ ఆరోపించారు. జల వనరుల అధికారులు సేకరించిన నీటి నమూనాల్లో ఎలాంటి విష ఆనవాళ్లు లేవని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ తన జీవితాంతం అబద్ధాలు చెబుతారని విమర్శించారు. కృతజ్ఞత లేని హర్యానా కుమారుడైన కేజ్రీవాల్‌ను ఢిల్లీ ప్రజలు శిక్షిస్తారని, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఓడిస్తారని అన్నారు.