హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఎంఎంటీఎస్ రైలు ఘటన యావత్ తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. ఒక యువతిపై జరిగిన అత్యాచారయత్నం రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, రైల్వే అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు.

ఘటనపై హరీశ్ రావు తీవ్ర స్పందన
రాష్ట్ర రాజధానిలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే, ప్రభుత్వం ఏమి చేస్తోంది? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మహిళలు సురక్షితంగా బతికే హక్కును కోల్పోయిన పరిస్థితి నెలకొన్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రక్షణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అత్యాచార కేసులు 29 శాతం పెరిగాయి అని డీజీపీ ప్రకటించడం భయానక విషయం అన్నారు. ప్రతిరోజూ 250 అత్యాచార కేసులు నమోదవుతుంటే, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? అని నిలదీశారు. ఈ ఘటనలో బాధితురాలు తన ప్రాణాలను కాపాడుకునేందుకు రైలు నుంచి దూకి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరింది. ఆమెకు న్యాయం చేయడం, ఆ దోషికి కఠిన శిక్ష విధించడం ప్రభుత్వం బాధ్యత అని హరీశ్ రావు అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ హయాంలో ఇలాంటి ఘోరాలు జరగలేదని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి, అని విమర్శించారు.
రైళ్లలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన రైల్వే పోలీసులు, నగర పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మహిళలు రాత్రివేళ సురక్షితంగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. సినిమాలు, ప్రెస్ మీటింగ్స్ కంటే ముందు ప్రజల భద్రతపై దృష్టి పెట్టండి, అని హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల రక్షణలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మీ చేతగాని పాలనే రాష్ట్రంలో మహిళలపై హింస పెరగడానికి కారణం అని తేల్చి చెప్పారు. హోంమంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి కనీసం బాధితురాలిని పరామర్శించలేదని మండిపడ్డారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం కాదు, ముందు వారి ప్రాణాలు కాపాడండి అని హరీశ్ రావు అన్నారు. ప్రతిరోజూ ఓ మహిళ హింసకు గురవుతోంది. కానీ ప్రభుత్వం చేతులెత్తేసి కూర్చుందని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో మహిళలు రాత్రి వేళ తిరగాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ప్రభుత్వం పెద్ద మూల్యాన్ని చెల్లించక తప్పదని హరీశ్ రావు హెచ్చరించారు.