ఉదయం 10 గంటలకు ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. 2025-26 బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఉభయ సభను ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆ తరువాత బీఏసీ సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు పాటు నిర్వహించాలి అనేది బీఏసీలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. ఇక 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనుంచి ప్రభుత్వం.

బడ్జెట్ కు ఆమోదం
తరువాత రెండు రోజుల పాటు సెలవులు ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 26 శివరాత్రి, 27 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈనెల 28వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28న ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది. అదే రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యాలు అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం వివరించనుంది.
శాంతి భద్రతల పై సమీక్ష
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రేపు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు కల్పించ వలసిన భద్రతపై డీజీపీ, ఇతర పోలీస్ అధికారులతో స్పీకర్ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యుల భద్రతతో పాటు అసెంబ్లీ బయట శాంతి భద్రతల పై సమీక్ష నిర్వహించనున్నారు స్పీకర్.. గవర్నర్ అసెంబ్లీ కి వచ్చిన దగ్గర్నుంచి తిరిగి రాజ్ భవన్ కు వెళ్లే వరకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై స్పీకర్ రేపు సమీక్ష చేయనున్నారు.