తెలంగాణ శాసనసభ వేదికగా రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడిన భాషపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జగదీశ్ రెడ్డిని అసెంబ్లీలో ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను అసెంబ్లీలో గళమెత్తగా, ప్రభుత్వం దానిని అణచివేయాలని చూస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి మాటల తీరుపై హరీశ్ రావు విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించినప్పటి నుండి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయన అసెంబ్లీలో ఉపయోగించిన భాషపై హరీశ్ రావు మండిపడ్డారు. “సీఎం బూతులకు జీఎస్టీ వేస్తే రాష్ట్ర ఖజానా మొత్తం సరిపోదు” అంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రాజకీయ నేతలు ఓర్పుతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. కేసీఆర్ చావును కోరుకున్న రేవంత్ ఇప్పుడు మాట మార్చి బీఆర్ఎస్‌ను అన్నానని చెప్పడం సిగ్గుచేటు అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఎప్పుడూ గౌరవంగా సంబోధించేవారని ఆయన గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మితిమీరిన భాష ఉపయోగించడం దారుణమని ఆయన పేర్కొన్నారు.
రుణమాఫీపై విమర్శలు
రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అసత్యమని హరీశ్ రావు ఆరోపించారు. సంపూర్ణ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా అంటూ ఆయన సవాల్ విసిరారు. రైతుల సమస్యలను లెక్కచేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పథకాల అమలుపై తాము తీవ్రంగా గమనిస్తున్నామని, రైతుల కోసం గట్టిగా పోరాడుతామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ హయాంలో దేశంలో అగ్రస్థానంలో నిలిపామని హరీశ్ రావు గుర్తు చేశారు. జీఎస్డీపీలో నంబర్ వన్, తలసరి ఆదాయంలో అగ్రస్థానం, విద్యుత్ వినియోగంలో మొదటి స్థానం, వరి ధాన్యం ఉత్పత్తిలో రికార్డు అని ఆయన వివరించారు. అంతేకాకుండా, బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలను గుర్తుచేశారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించడం ప్రతి ఇంటికి తాగునీరు అందించడంతో దేశానికి ఆదర్శంగా నిలవడం అయితే, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని హరీశ్ రావు విమర్శించారు. ప్రాజెక్టులు అగ్గిపెట్టెల్లా కూలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి అంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు.
హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని వెంటాడతాం అని స్పష్టం చేశారు. మహాలక్ష్మి కింద రూ.2500 మహిళలకు అందించే వరకు, రైతు రుణమాఫీ పూర్తయ్యే వరకు, రైతులకు రూ.15 వేల రైతు బంధు డబ్బులు పడే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఒక్కొక్కరినీ తొక్కుకుంటూ, సీనియర్లపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారు అని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్‌లో పదవులు కొనుగోలు జరిగాయని పరోక్షంగా సూచిస్తూ, రూ.50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కున్నారని కొందరు చెబుతున్నారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.