మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ‘చిరుత’ సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన చరణ్, తన రెండో చిత్రం ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ సాధించారు. ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త రికార్డులు నమోదు చేసి, రామ్ చరణ్‌ను స్టార్ హీరోగా నిలబెట్టింది. అద్భుతమైన నటన, నృత్య నైపుణ్యంతో ఆయన అభిమానులను అలరించగలిగారు.
వైవిధ్యమైన కథలతో రాణింపు
రామ్ చరణ్ ఒక కమర్షియల్ హీరో మాత్రమే కాకుండా, కథా బలం ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకునే ప్రయత్నం చేశారు. ‘రంగస్థలం’ వంటి చిత్రంతో తన నటనలో కొత్త కోణాన్ని చూపించారు. ఈ సినిమాలో ఆయన పోషించిన చిట్టిబాబు పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ‘ధృవ’, ‘యేవడు’ లాంటి చిత్రాలతో కూడా ఆయన తనను నిరూపించుకున్నారు. పలు భిన్నమైన పాత్రలను పోషిస్తూ తన సినీ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు.

RRR తో గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్
కెరీర్ లో మరో మైలురాయి ‘RRR’. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, చరణ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చింది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా ఆయన పోషించిన పాత్రకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం ఆస్కార్ అవార్డు వరకు వెళ్ళడంతో, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. హాలీవుడ్ లో కూడా చరణ్ క్రేజ్ పెరుగుతూ, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు, మీడియా హౌస్‌లు ఆయనపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి.
వ్యక్తిత్వం, సేవా కార్యక్రమాలు
సినిమాల్లో మెరిసే రామ్ చరణ్ వ్యక్తిగతంగా చాలా వినయంతో, సంయమనం కలిగిన వ్యక్తిగా పేరు పొందారు. తండ్రి చిరంజీవిని అనుసరించి, తన మద్దతుతో చాలామంది సినీ కార్మికులకు సహాయం అందిస్తున్నారు. కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలిసి సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగినా తన అంకితభావం, వినయం మారలేదు. నేడు ఆయన పుట్టినరోజును ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు.