Hamas: మొదటి దశ కాల్పుల విరమణ ముగిసిన అనంతరం గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం భారీ వైమాణిక దాడులు చేయడంతో 400 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద సంస్థ హమాస్ కీలక ప్రకటన చేసింది. చర్చలకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపింది. కాల్పుల విరమణ అమలు చేయాలని అందుకు గాను ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొంది. కాల్పుల విరమణను తిరిగి అమలు చేసేందుకు హమాస్ సిద్ధంగా ఉంది. కానీ జనవరి 19న అమల్లోకి వచ్చిన ఒప్పందంపై తిరిగి చర్చలు జరపబోము. చర్చలకు ఇంకా సమయం ఉంది. కానీ కొత్త ఒప్పందాలు అవసరం లేదు అని హమాస్ ప్రతినిధి తాహెర్ అల్ నును తెలిపారు.

గతంలో మాదిరిగానే అగ్రిమెంట్
తమకు ఎటువంటి షరతులూ లేవని, రెండో దశ కాల్పుల విరమణకు వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే అగ్రిమెంట్ ఉండాలని కానీ కొత్త ఒప్పందాలను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల ప్రారంభంలో ముగిసింది. అయితే రెండో దశ కాల్పుల విరమణ ఉంటుందని అంతా భావించినప్పటికీ దానికి సంబంధించిన చర్చలు ప్రారంభం కాలేదు. దీంతో మిగిలిన బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ హమాస్‌కు సూచించింది. కానీ హమాస్ దానిని పట్టించుకోకపోవడంతో ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది.