అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి. ‘అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పునరుద్ధరణ’ అంశంపై విచారణ చేపట్టిన యూఎస్ హౌజ్ కమిటీకి సెంటర్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్‌కు చెందిన జెస్సికా ఎం వాఘన్ కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇతర దేశాలకు చెందిన నిపుణులు అమెరికా కంపెనీల్లో పని చేసేందుకు మూడేండ్ల కాలపరిమితితో ఇస్తున్న హెచ్-1బీ వీసాలను రెండేండ్లకే ఇవ్వాలని, అవసరమైతే నాలుగేండ్ల కాలానికి మాత్రమే పొడిగించే అవకాశం కల్పించాలని ఆమె సూచించారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారనే కారణంతో ఆటోమేటిక్‌గా హెచ్-1బీ వీసాను పొడిగించే విధానాన్ని తొలగించాలని ప్రతిపాదించారు. హెచ్-1బీ వీసాల సంఖ్యను సైతం 75 వేలకే పరిమితం చేయాలని సూచించారు. విద్యార్థి వీసాలపై(ఎఫ్-1, ఎం-1) అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల నుంచి చదువు పూర్తయిన తర్వాత తిరిగి సొంత దేశాలకు వెళ్తామనే సమ్మతిని తీసుకోవాలని ప్రతిపాదించారు.

గడువు ముగిసినా అమెరికాలోనే..
విద్యార్థి, ఎక్స్ఛ్‌ంజ్ వీసాలపై అమెరికాకు వస్తున్న చాలా మంది వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్నారని జెస్సికా ఎం వాఘన్ తెలిపారు. 2023లోనే వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిలో భారతీయులే 7 వేల మంది ఉన్నారని, ఆ తర్వాత బ్రెజిల్, చైనా, కొలంబియా దేశస్థులు 2 వేల మంది కంటే ఎక్కువే ఉన్నారని నివేదించారు.