Guntur: గుంటూరు నగర మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. నగరకమిషనర్ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ప్రతిపక్ష నాయకులు ప్రజలు ఇచ్చిన పదవుల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. 2021లో మనోహర్ నాయిడు గుంటూరు మేయర్‌గా ఎన్నికయ్యారు.

గుంటూరు జిల్లా రాజకీయాల్లో కలకలం
మనోహర్ పదవీ కాలం మరో ఏడాది ఉంది. ఇంతలోనే రాజీనామా చేయడం గుంటూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేగింది. ఆయనకు కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో పొసగడం లేదు. ఇద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. ఎక్కువ కూటమి సభ్యులు విజయం సాధించారు. దీనికి తోడు కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూడా కూటమి పార్టీల్లో చేరారు.
జగన్‌తోనే నడుస్తానని
ఇలా గుంటూరు రాజకీయాలు మారుతున్న టైంలో సోమవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మనోహర్‌పై అవిశ్వాసం పెట్టబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ చర్చ నడుస్తున్న టైంలో మనోహర్ రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఎన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. జగన్‌తోనే నడుస్తానని ప్రకటించారు. ఎప్పటికీ వైసీపీలో ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా అవమానాలు, నిందలు ఎదుర్కొని నిలబడ్డానని ఇకపై నిలబడలేకే పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు.