వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. చెస్‌లో తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గుకేశ్, ఈ సందర్భంగా మోదీతో తన విజయ ప్రయాణం గురించి చర్చించారు. దేశాన్ని గర్వపడేలా చేసిన గుకేశ్‌ను ప్రధాని అభినందించారు. ఈ ప్రత్యేక కలయిక సందర్భంగా మోదీ గుకేశ్ కు చెస్ బోర్డు కానుకగా అందజేయడం విశేషం. శాలువాతో సత్కరించి గుకేశ్‌ను ప్రోత్సహించారు. గుకేశ్ వంటి యువ ప్రతిభలు భారతదేశానికి భవిష్యత్తులో మరిన్ని గౌరవాలను తీసుకురావడం ఖాయమని ప్రధాని మోదీ అన్నారు. దేశానికి మరింత పేరు తెచ్చేలా పనిచేయాలని గుకేశ్‌కు సూచించారు. మోడీ ని కలవడం తన జీవితంలో మరచిపోలేని సంఘటన అని గుకేశ్ అన్నారు. “ప్రధాని మోదీ వంటి గొప్ప నేతతో కలవడం నా జీవితంలో గొప్ప గుర్తుగా నిలుస్తుంది” అని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
గుకేశ్ చెస్ ప్రపంచంలో అతి చిన్న వయస్సులోనే ప్రపంచ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. భారత చెస్ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం రాసిన గుకేశ్, ఇప్పటికీ కొత్త రికార్డులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ విజయాల వెనుక తన కుటుంబం, గురువుల సహకారం అపారమని గుకేశ్ తెలిపాడు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ ని సైతం గుకేశ్‌ను కలవడం జరిగింది. రజనీకాంత్ వంటి దిగ్గజం తన విజయాలను ప్రశంసించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని గుకేశ్ తెలిపాడు. దేశంలోని అగ్రశ్రేణి వ్యక్తుల అభినందనలు గుకేశ్ ప్రతిభకు నిదర్శనం. దేశ యువతకు గుకేశ్ ప్రేరణగా నిలుస్తున్న ఈ సంఘటన చెస్‌కు కూడా మంచి గుర్తింపునిచ్చేలా ఉంది.