అమరావతి: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలుచేయనుందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తల్లికి వందనం అమలుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని శాసన మండలిలో లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకం పై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ రాదు
ఏపీలో బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ బదులిచ్చారు. తల్లికి వందనం సహా అన్ని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్న నారా లోకేష్.. నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిరుద్యోగులకు జాబ్స్ ఇవ్వడంపై గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని నారా లోకేష్ పేర్కొన్నారు.
ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులు భర్తీ
సామాజిక పింఛన్లు వెయ్యి రూపాయలు పెంచిన కూటమి ప్రభుత్వం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఏపీ అసెంబ్లీ సమావేశాలలో మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తాజాగా తల్లికి వందనంపై సైతం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించి ఏపీ ఎన్నికల్లో నెగ్గి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వైసీపీ హయాంలో అమ్మ ఒడి పేరుతో మొదలుపెట్టిన పథకానికి కూటమి మార్పులు చేర్పులు చేపట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలనే తల్లికి వందనం పేరుతో అమలు చేస్తామని.. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఒక్కో విద్యార్థికి ఏడాదికి 15 వేలు జమ చేస్తామని చెప్పారు.