హైదరాబాద్: నేడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆయన తల్లి నారా భువనేశ్వరి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా రంగానికి, సీఎంగా తెలుగు ప్రజలకు చేసిన సేవల్ని వారు గుర్తుచేసుకున్నారు. మహానేత, యుగపురుషుడు ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది.. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది.. స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త.. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనతో.. ‘‘అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం’’ అని నిరూపించిన మాననీయులు ఎన్టీఆర్ ఆశించిన సమసమాజాన్ని సాధించుకుందాం. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని.. తెలుగు జాతిని నెంబర్ వన్ చేసేందుకు కంకణబద్ధులై ఉన్నామని తెలుపుతూ.. ఆ యుగపురుషుని వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
మరోవైపు ఎన్టీఆర్ ఘాట్‌కు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కాసేపటి క్రితమే చేరుకుని వారి తాతయ్య ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఘాట్‌లో కింద కూర్చుని తాతయ్యను స్మరించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ని చూసేందుకు ఘాట్ వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఎన్టీఆర్ ఘాట్‌లో సమాధి చుట్టూ తిరిగి పూలతో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా అభిమానులు పలు సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.