భారతదేశ రాజకీయ చరిత్రలో అమూల్యమైన వ్యక్తిత్వం, సౌమ్యతకు ప్రతీకగా నిలిచిన మన్మోహన్ సింగ్ మృతి దేశాన్ని విషాదంలో ముంచింది. ఆయన భారత ఆర్థిక రంగానికి చేసిన సేవలు, 1991 ఆర్థిక సంస్కరణల అమలులో కీలక పాత్ర పోషించడం ఎంతోమందికి ప్రేరణగా నిలిచాయి. రాజకీయాలకు అతీతంగా, ప్రజల మనసుల్లో తనదైన ముద్ర వేసిన ఈ మహానీయుడు 91 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.మన్మోహన్ సింగ్ మృతి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈరోజు (డిసెంబరు 27) దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాలు రద్దు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనితో ప్రజలు ఆయన సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ జీవిత విశేషాలు, దేశానికి ఆయన చేసిన సేవలను చర్చించి, మరింత గౌరవార్హ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంత్యక్రియలను పూర్తిస్థాయి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని రాష్ట్రీయ ఘాట్ వద్ద ఆయన అంతిమయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నేతలు, సామాన్యులు ఆయనకు నివాళులర్పించేందుకు ఢిల్లీ చేరుకుంటున్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా దేశమంతా ఆయన సేవలను ప్రశంసిస్తోంది.