ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు లీవ్స్ ఉండటం సహజమే.ఏదైనా అత్యవసర పని ఉన్నప్పుడు అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఇటు ప్రైవేట్ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు లీవ్స్ పెట్టడం చూస్తుంటాం. ఒకవేళ లీవ్ దొరకకపోతే ప్లాన్స్ మార్చుకుంటాం. ఇంతే అని సర్దుకుపోతాం. కానీ బెంగాల్ కు చెందిన ఓ ప్రభుత్వోద్యోగి మాత్రం వింతగా ప్రవర్తించాడు. లీవ్ ఇవ్వలేదని రెచ్చిపోయాడు. ఆఫీస్ లో బీభత్సం సృష్టించాడు. సహోద్యోగులపై ఏకంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అలాగే ఆఫీస్ బయటకు వచ్చి రోడ్లపై ఉన్న జనాన్ని కత్తితో బెదిరించాడు. కొద్దిసేపు ఆ ప్రాంతంలో నానా హైరానా సృష్టించాడు. ఆయన చేతిలోని కత్తిని చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వెస్ట్ బెంగాల్ లోని కోల్ కతా న్యూ టౌన్ ఏరియాలోని కరిగోరి భవన్ లో అసిత్ సర్కార్ అనే ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏదో పనిమీద సర్కార్ లీవ్ కోసం అప్లై చేశాడు. అయితే ఆయన అభ్యర్థనను పైస్థాయి అధికారులు తిరస్కరించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన అసిత్ .. కార్యాలయంలోని తోటి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగాడు. తన దగ్గర ఉన్న కత్తితో ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడు. ఆఫీస్ లోని సెక్యూరిటీ గార్డును సైతం గాయపరిచాడు. ఆ తర్వాత కార్యాలయం బయటకు వచ్చి.. రోడ్డుపై వచ్చిపోయే ప్రజలకు కత్తి చూపిస్తూ భయపెట్టాడు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.