ఉగాది పండుగ సందర్భంగా గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో మాట్లాడిన భట్టి, ఈ అవార్డులు మానవతా విలువలను ప్రోత్సహించడమే లక్ష్యంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ఉగాది వేళ మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుందని అన్నారు.
సినీ ఇండస్ట్రీలో ప్రతిభావంతులు, వినూత్న కృషి చేసిన వారిని గుర్తించేందుకు గద్దర్ అవార్డులు ఒక చిహ్నంగా నిలుస్తాయని డిప్యూటీ తెలిపారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేయాలని, దీనిని గ్రాండ్ ఈవెంట్‌గా మార్చాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌ను ప్రపంచ సినీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ అవార్డులు కీలక పాత్ర పోషిస్తాయని భట్టి చెప్పుకొచ్చారు. సినిమా రంగంలో మానవతా విలువలతో కూడిన కథల ప్రాధాన్యత గురించి ఆయన ప్రస్తావించారు. సమాజానికి స్ఫూర్తి నిచ్చే చిత్రాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని భట్టి తెలిపారు. అలాగే నూతన దర్శకులు, సృజనాత్మక నిర్మాతలకు అవార్డులు ప్రోత్సాహకరంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని భట్టి గుర్తు చేసారు. నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.