రోస్టర్ విధానంపై అభ్యర్థులు 3 రోజులుగా ఆందోళన
అమరావతి: ఏపీలో గ్రూప్-2 పరీక్షలపై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల అంశాలపై సీఎం చంద్రబాబు శనివారం పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రోస్టర్ విధానంపై అభ్యర్థులు 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు. అభ్యర్థుల ఆందోళన తమ దృష్టికి రాగానే సాధ్యాసాధ్యాలు పరిశీలించినట్లు తెలిపారు.

పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ
కోర్టులో మార్చి 11న విచారణ దృష్ట్యా అప్పటి వరకు పరీక్ష వాయిదా వేయాలని APPSCకి లేఖ రాసినట్లు చెప్పారు. రిజర్వేషన్ రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ అభిమతమని సీఎం వివరించారు. ప్రస్తుతం రోస్టర్ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 11వ తేదీన మరోమారు ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. హై కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ
కాగా, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, రోస్టర్ విధానంలో మార్పులు చేయాలంటూ అభ్యర్థులు కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా.. పరీక్షలను నిలిపి వేయడాన్ని నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించి, 23న జరగనున్న గ్రూపు-2 మెయిన్స్ పరీక్షను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.