మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరిస్తూ కేసుల కొట్టివేత
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కీలక నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారీ ఊరట లభించింది. ఆయన మీదున్న విద్వేషపూరిత ప్రసంగం కేసులను శుక్రవారం ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు ఐదు పోలీస్ స్టేషన్లలో రాజాసింగ్‌పై విద్వేషపూరిత ప్రసంగం కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులపై శుక్రవారం విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు మరోసారి రిపీట్ కావొద్దని హెచ్చరిస్తూ కొట్టివేసింది.

విద్వేష పూరిత ప్రసంగాలు
కాగా, రాజాసింగ్ సోషల్ మీడియా ఖాతాపై మెటా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన ప్రదర్శనలకు సంబంధించి ఆయన పోస్టు చేసిన వీడియోలను తొలగించింది. రాజాసింగ్ 2024వ సంవత్సరంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది రాజాసింగ్ పాల్గొన్న రాజకీయ ర్యాలీలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, మతపరమైన ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు, జాతీయ వాద ర్యాలీల వీడియోలను అధ్యయనం చేసి అవి ద్వేషపూరితమైనవని నిర్ధారించింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను ఐటీ దిగ్గజ సంస్థ మెటా తొలగించింది.
హిందువుల వద్దనే పూజ సామాన్లు కొనుగోలు
కాగా, ఇటీవల మహాశివరాత్రి పండుగ వేళ కూడా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా హిందువులు అందరూ తప్పకుండా హిందువుల వద్దనే పూజ సామాన్లు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. రోజుల తరబడి స్నానం చేయకుండా.. గొడ్డు మాంసం తిని పూజా సామాగ్రి అమ్ముతున్న వాళ్ల దగ్గర మహా శివరాత్రికి ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయవద్దంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు రెండ్రోజుల పాటు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.