సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ (MLA Sri Ganesh)పై దాడికి పాల్పడేందుకు దుండగులు యత్నించారు. మాణికేశ్వర్ నగర్ వడ్డెర బస్తీలో బోనాల (Bonala) సందర్భంగా నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో సుమారు 50 మంది దుండగులు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించారు.శ్రీగణేశ్ తెలిపిన వివరాల ప్రకారం, దుండగులు 20 బైక్‌లపై వచ్చి ఆయన వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. కారులో నుంచి దిగాలని బెదిరించారు. అంతేగాకుండా ఆయనకు రక్షణగా ఉన్న గన్‌మన్ వద్ద నుండి ఆయుధాలను లాక్కొనే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే వెంటనే ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల స్పందన – ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఫిర్యాదు అనంతరం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. దాడికి యత్నించిన వారిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఇప్పటికే ఆరుగురు గుర్తించబడినట్టు అధికారులు తెలిపారు.ఈ ఘటనపై మంత్రి వాకాటి శ్రీహరి స్వయంగా ఓయూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి శ్రీగణేశ్‌తో మాట్లాడారు. జరిగిన పరిణామాలను తెలుసుకున్నారు. సీఎం కార్యాలయం కూడా ఈ అంశంపై సీరియస్‌గా స్పందించింది. సీపీకి పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్యే శ్రీగణేశ్ రాజకీయ ప్రస్థానం
శ్రీగణేశ్ తొలిసారి 2024 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. అప్పటి వరకు ఆయన బీజేపీలో కొనసాగారు. 2018, 2023 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి విజయాన్ని సాధించారు. ఇప్పుడు ఇలాంటి దాడి యత్నంతో సికింద్రాబాద్ రాజకీయ వాతావరణం ఉత్కంఠకు గురైంది.
Read Also : Mudragada Padmanabham : ముద్రగడ ఆరోగ్యంపై జగన్ ఆరా