ఇంటర్నెట్ సదుపాయాలు విస్తరించాయి. కానీ అవి తప్పనిసరిగా సరైన దిశకే నడిపిస్తాయన్న గ్యారంటీ లేదు. తాజాగా జనగామ జిల్లాలో జరిగిన ఒక ఘటన ఈ విషయాన్ని స్పష్టంగా చూపింది. గూగుల్ మ్యాప్ (Google Maps) సూచనల్ని గుడ్డిగా నమ్మిన నలుగురు యువకులు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకున్నారు.ఈ ఘటన శుక్రవారం రాత్రి వడ్లకొండ వద్ద చోటుచేసుకుంది. మహారాష్ట్ర (Maharashtra)కు చెందిన నలుగురు యువకులు తిరుపతికి కారులో బయలుదేరారు. మార్గం కోసం గూగుల్ మ్యాప్స్‌పై పూర్తిగా ఆధారపడ్డారు. జనగామ జిల్లా వడ్లకొండ సమీపానికి రాత్రిపూట చేరుకున్నారు. అయితే, మ్యాప్ వీరిని నిర్మాణంలో ఉన్న ఓ వంతెన వైపు దారి చూపించింది.

చీకట్లో అసంపూర్ణ వంతెన కనిపించలేదు
రాత్రి చీకట్లో వంతెన నిర్మాణంలో ఉందన్న విషయం వారికి గుర్తించలేదు. అలానే కారును ముందుకు నడిపారు. కొన్ని క్షణాల్లోనే వాహనం అదుపుతప్పి వంతెన చివర నుంచి నేరుగా కింద ఉన్న వాగులోకి దూకిపోయింది. అక్కడున్న మట్టిదిబ్బపై కారు పడటంతో పెను ప్రమాదం తప్పింది.
స్వల్ప గాయాలతో బయటపడ్డ యువకులు
కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కానీ అందులో ఉన్న యువకులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకుని యువకులను రక్షించి ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల హెచ్చరిక: మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మవద్దు
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కీలక సూచనలు చేశారు. రాత్రివేళల్లో అనుపరిచిత ప్రాంతాల్లో ప్రయాణించే వారు గూగుల్ మ్యాప్‌పైనే పూర్తిగా ఆధారపడొద్దని చెప్పారు. నిర్మాణంలో ఉన్న వంతెనలు, మార్గాలు మ్యాప్‌లో కనిపించకపోవచ్చని హెచ్చరించారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.