దేశంలో భారతీయ రైల్వే సంస్థ కోట్ల మంది ప్రయాణికులను రోజూ వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. దశాబ్ధాలుగా తక్కువ ఖర్చులో దూర ప్రయాణాలు చేసేందుకు ఈ ప్రభుత్వ సంస్థ వీలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే సంస్థ కూడా ప్రజలకు వెసులుబాటును కల్పిస్తూ డిజిటలైజ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ‘ఇప్పుడే బుక్ చేయండి-తర్వాత చెల్లించండి'(Book Now-Pay Later) కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికింద ప్రయాణికులు టిక్కెట్లను వెంటనే బుక్ చేసుకుని తర్వాత డబ్బులు పే చేసేందుకు వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇకపై ముందస్తుగా టిక్కెట్ కొనుగోలుకు డబ్బు చెల్లించకుండానే కన్ఫర్మ్ టిక్కెట్ను పొందవచ్చని తెలుస్తోంది.

బుక్ నౌ-పే లేటర్ ప్రక్రియకు వెళ్లటానికి దీనికి సంబంధించిన షరతుల గురించి ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలను ఇప్పుడు గమనిద్దాం.. * ముందుగా ప్రయాణికులు తమ IRCTC ఖాతాలోకి లాగిన్ చేసి, ఆపై ‘బుక్ నౌ’ ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది. * ఈ సమయంలో క్యాప్చా కోడ్‌తో పాటు ప్రయాణీకుల వివరాలను అందించాల్సిన కొత్త పేజీ తెరవబడుతుంది. ఇక్కడ ప్రయాణం చేస్తున్న వ్యక్తులకు సంబంధించిన వయస్సుతో పాటు ఇతర వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. వివరాలను అందించిన తర్వాత చెల్లింపు పేజీకి వెళ్లినప్పుడు పేమెంట్ పేజ్ తెరవబడుతుంది. ఇక్కడ BHIM UPI యాప్ లేదా నెట్ బ్యాంకింగ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల ద్వారా చెల్లించటానికి వెసులుబాటు ఉంటుంది.
* ఇప్పుడు ప్రయాణికులు పే లేటర్ ఫీచర్‌ని ఉపయోగించాలనుకునే కస్టమర్‌లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. కస్టమర్ ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండానే రైలు టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. టిక్కెట్లను పే లేటర్ కింద బుక్ చేసుకున్న వ్యక్తులు టిక్కెట్ రిజర్వేషన్ తర్వాత 14 రోజుల్లోపు చెల్లింపును పూర్తి చేయాల్సి ఉంటుంది.