హైదరాబాద్ వాసులు అతి త్వరలో గుడ్ న్యూస్ వినబోతున్నారు. మెట్రో ప్రయాణికులకు మరింత అనుకూలంగా మారనున్నట్లు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం 3 కోచ్లతో నడుస్తున్న మెట్రో ట్రైన్లను 6 కోచ్లుగా విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే మెట్రోలో రోజువారీ ప్రయాణికుల రద్దీ తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
“ప్రస్తుతం ఉన్న ట్రైన్లను 3 నుంచి 6 కోచ్లకు పెంచడంపై అధ్యయనం జరుగుతోంది. అయితే, 8 కోచ్ల ట్రైన్లను నడపడానికి ఈ మెట్రో డిజైన్ అనుకూలం కాదు” అని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణంలో అనేక ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇతర మెట్రో నగరాల్లా కాకుండా, హైదరాబాద్ మెట్రో ప్రత్యేకతను మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిలో నిర్మితమైంది. ఇదే దీని ప్రత్యేకత అని ఆయన చెప్పారు. ప్రయాణికుల అనుభవాలను మెరుగుపరిచే దిశగా మెట్రో సాంకేతికతను విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు 6 కోచ్ల విస్తరణ అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమలుకు అవసరమైన ప్రణాళికలు త్వరలో సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల నుంచి అనుకూల స్పందనను తెచ్చుకోవచ్చని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.