- వేసవి రాకముందే బీర్ల తయారీ సంస్థలు ఉత్పత్తి వేగం
తెలంగాణ మందుబాబులకు గుడ్‌న్యూస్. వేసవి రాకముందే బీర్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని వేగవంతం చేశాయి. ఇటీవల ప్రభుత్వ నిర్ణయంతో బీర్ల ధరలు పెరిగినా, డిమాండ్ తగ్గకుండా కొనసాగుతోంది. గతంలో ఎండాకాలంలో మద్యం ప్రియులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎక్కడా ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకుండా ఉండేలా కంపెనీలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.

బీర్లకు డిమాండ్ మరింతగా పెరిగే ఛాన్స్
ముఖ్యంగా, పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ఎండలు పెరుగుతుండటంతో బీర్లకు డిమాండ్ మరింతగా పెరిగే అవకాశముంది. దీంతో బీర్ల ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్రంలోని ప్రముఖ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 13 సంస్థలు బీర్లను తయారు చేస్తున్నా, వాటిలో 4 ప్రధాన కంపెనీలు 3 షిఫ్టుల్లో పని చేస్తూ ఉత్పత్తిని మరింత వేగవంతం చేశాయి.
ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందుబాటులో బీర్లు
ప్రస్తుతం తెలంగాణలో యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) సహా 13 కంపెనీలు రోజుకు సగటున 1.5 లక్షల నుంచి 2 లక్షల కాటన్ల బీర్లను డిపోలకు సరఫరా చేస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అనుమతులతో పాటు అవసరమైన రుసుములు కూడా చెల్లించాయి. దీంతో ఎండాకాలంలో కూడా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
కింగ్‌ఫిషర్ సహా ఇతర ప్రముఖ బ్రాండ్ల బీర్ల సరఫరా
ప్రముఖ బ్రాండ్‌ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఉత్పత్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా కింగ్‌ఫిషర్ సహా ఇతర ప్రముఖ బ్రాండ్ల బీర్ల సరఫరా కూడా భారీగా పెరిగింది. రోజుకు 19 డిపోలకు సుమారు 2 లక్షల కాటన్ల వరకు బీర్లను పంపిణీ చేసే విధంగా కంపెనీలు ఏర్పాట్లు చేశాయి.
ఈ ఏర్పాట్లతో గత ఎండాకాలంలో ఎదురైన బీర్ల కొరత సమస్యను ఈసారి ఎదుర్కోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో తెలంగాణ మద్యప్రియులు వేసవి వేడిని చల్లబరుచుకునేందుకు చక్కటి అవకాశం దక్కినట్లైంది.