తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త అందించింది. ఇప్పటికే ఉద్యోగ భద్రత, పదోన్నతుల కోసం పోరాడుతున్న హెల్పర్లకు ఇకపై మరింత అవకాశాలు లభించనున్నాయి. హెల్పర్ల నుంచి అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ పొందేందుకు ఉన్న గరిష్ఠ వయసును 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ఫైల్‌పై సంతకం చేశారు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
4,322 మంది అంగన్వాడీ హెల్పర్లకు నేరుగా లాభం
ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 45 నుండి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న 4,322 మంది అంగన్వాడీ (Anganwadi) హెల్పర్లకు నేరుగా లాభం చేకూరనుంది. ఇప్పటివరకు వయస్సు కారణంగా పదోన్నతికి అర్హత కోల్పోతున్న వర్గానికి ఇది ఊరట కలిగించే అంశం. అంగన్వాడీ వ్యవస్థలో అనుభవం, సేవలపై ఆధారపడి ఉండే ఈ ప్రమోషన్లు వయస్సు పరిమితితో మూసుకుపోతుండటాన్ని ప్రభుత్వం గమనించింది. దీంతో వయస్సు పరిమితిని సడలించడానికి నిర్ణయం తీసుకుంది.
అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయస్సు పెంపు
ఇటీవలే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుని అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. ఈ రెండు నిర్ణయాలు కలిపి చూస్తే అంగన్వాడీ వ్యవస్థలో పని చేసే మహిళలకు భవిష్యత్ భద్రత, స్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. హెల్పర్లకు ఇది ప్రోత్సాహకరమైన మార్పుగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న మహిళా సంక్షేమ నిర్ణయాల్లో ఇది ఒక భాగంగా నిలిచే అవకాశముంది.
Read Also : Movierulz : చిత్రసీమకు రూ.3,700 కోట్ల నష్టం తెచ్చిన వ్యక్తి అరెస్ట్