బంగారం ధరలు (Gold Rate) మరోసారి భారీగా పెరిగి రూ.1,00,210 (10 గ్రాముల) స్థాయిని తాకాయి. పలు అంతర్జాతీయ మరియు జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్ క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి ధరల (Gold Rate)కు మళ్లీ రెక్కలొచ్చాయి. దీన్ని అనుసరించి దేశీయ విపణిలో పుత్తడి ధర మళ్లీ రూ.లక్ష మార్క్ దాటింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,00,210గా ఉంది. అటు కిలో వెండి ధర రూ.1,08,700 చేరుకుంది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్
గురువారం నాటి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ ట్రేడింగ్‌లో 10 గ్రాముల పుత్తడి (Gold) ధర రూ.97,650గా ఉంది. క్రితం సెషన్ ముగింపుతో (రూ.96,704) పోలిస్తే ధర 0.97శాతం పెరగడం గమనార్హం. అటు అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర 0.6 శాతం పెరిగి 3,372.46 డాలర్లుగా ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్‌లోనూ పసిడి ధర 1.5శాతం మేర పెరిగింది. అమెరికా డాలర్ విలువ రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీని ప్రభావంతో విదేశీ మదుపర్లు బులియన్ మార్కెట్‌పై దృష్టి పెడుతున్నారు. డాలర్ బలహీనతతో బంగారం విదేశీ మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తోంది, డిమాండ్ పెరుగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్:
అమెరికా డాలర్ విలువ క్రమంగా బలహీనపడుతోంది. రెండు నెలల కనిష్ఠానికి పడిపోయింది. దీంతో విదేశీ కొనుగోలుదారులు బులియన్ మార్కెట్‌పై దృష్టిపెట్టారు. అటు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ (America-Iran) మధ్య ఉద్రిక్తతలు, అమెరికా-చైనా (America- China) వాణిజ్య ఒప్పందం వంటి కారణాలతో పుత్తడికి డిమాండ్ పెరిగింది. ఇక, కేంద్ర బ్యాంకులు కూడా పసిడిని కీలకమైన రిజర్వ్ ఆస్తిగా భావిస్తూ కొనుగోళ్లు పెంచుతున్నాయి. దీంతో బంగారం ధర (Gold Rate) పరుగులు పెడుతోంది అని ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అక్షా కాంబోజ్ వెల్లడించారు.
వినియోగదారులపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని తమ రిజర్వ్‌లో భాగంగా కొనుగొంటున్నాయి. ఇది బంగారం ధరకు అదనపు మద్దతు ఇస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధర (Gold Rate) ఇలా పెరగడం చిన్న వినియోగదారులకు భారంగా మారుతోంది. చాలా మంది బంగారం కొనుగోలు మానుకోవడమో లేక ఆలస్యం చేయడమో చేస్తున్నారు. బంగారం ధర మళ్లీ లక్ష మార్క్ దాటిన నేపథ్యంలో, వినియోగదారులు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, కేంద్ర బ్యాంకుల వ్యూహాలు బంగారం ధరలపై గణనీయ ప్రభావాన్ని చూపుతున్నాయి. కొనుగోలు చేయాలా? వేచి చూడాలా? అనే ప్రశ్నకు సమాధానం మార్కెట్ స్థిరత ఆధారంగా నిర్ణయించుకోవడం ఉత్తమం.
Read Also: Indian Companies: భారత కంపెనీల ప్రతినిధులు చైనాకు