Karantaka Assembly : కర్ణాటక అసెంబ్లీలో ఎక్సైజ్ రెవిన్యూ ఎలా పెంచాలన్న దానిపై జరిగిన చర్చ.. మద్యం బాటిళ్లు ఉచితంగా అందించాలనే దానిపైకి వెళ్లింది. ఓ సీనియర్ ఎమ్మెల్యే వారానికి రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వాలని కోరగా.. మరొకరు పూర్తిగా నిషేధం విధించాలన్నారు. 2025-26 బడ్జెట్‌లో ఎక్సైజ్ రెవిన్యూ లక్షాన్ని ప్రస్తుతం ఉన్న ౩6,500 కోట్ల నుంచి 40,౦౦౦ కోట్లకు పెంచారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఒక్క ఏడాదిలోనే మద్యం పన్నులను మూడుసార్లు పెంచారు. ఇది పేదలపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పుడు ఎక్సైజ్ టార్గెట్‌ను 40వేల కోట్లు అని చూపించారు. టాక్స్‌లను పెంచకుండా ఈ రెవిన్యూ ఎలా వస్తుందని”JD(S) కు చెందిన తిరువేకెరె ఎమ్మెల్యే కృష్ణప్ప ప్రశ్నించారు.

ప్రభుత్వం సొసైటీల ద్వారా వారికి మద్యం సరఫరా
మద్యం నుంచి వచ్చిన ఆదాయంతోనే రాష్ట్రంలో ఉచిత పథకాలను అమలు చేస్తున్నారని కృష్ణప్ప ఆక్షేపణ తెలిపారు. మనం మద్యం తాగకుండా ప్రజలను ఆపలేం. ముఖ్యంగా కార్మిక వర్గానికి చెందిన వారిని నియంత్రించలేం. వాళ్ల డబ్బులతో మహిళలకు ప్రతీనెల 2000 ఇస్తున్నారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం ఇవన్నీ కూడా వాళ్లు తాగితే వచ్చిన డబ్బుతో ఇస్తున్నవే. వాళ్లని తాగనివ్వండి వాళ్లకి ఎలాగో మనం ప్రతీనెలా డబ్బులు కూడా ఇవ్వలేం కదా. అని ఆయన అన్నారు. మందు తాగుతున్న మగాళ్లకు కూడా ఏదైనా చేయాలి. వాళ్లకి ప్రతీ వారం రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి. ఇందులో తప్పేముంది. ప్రభుత్వం సొసైటీల ద్వారా వారికి మద్యం సరఫరా చేయాలని అనడంతో అసెంబ్లీ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది.
మద్యాన్ని నిషేధించే ఆలోచన చేయాలి
దీనికి ప్రభుత్వం తరపున ఇంధన మంత్రి కె.జె.జార్జి సమాధానం ఇస్తూ.. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. మద్యపాన వినియోగాన్ని తగ్గించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నేత బీఆర్‌పాటిల్ మాట్లాడుతూ మద్యాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ఎక్సైజ్ రెవిన్యూ.. ఇది పాపిష్టి సొమ్ము. మనం పేదవారి రక్తాన్ని పిండి సంపాదిస్తున్న డబ్బు. దీనితో జాతి నిర్మాణం చేయలేం అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించే ఆలోచన చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.