తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న ఓ బాలికకు పీరియడ్స్ వచ్చాయని క్లాస్ రూమ్‌లోనికి అనుమతించకుండా స్కూల్ ప్రిన్సిపల్ ఆమెను బయట కూర్చోబెట్టారు. అందులోనూ 2 రోజుల పాటు జరిగే పరీక్షల్ని ఆమె క్లాస్ రూమ్ వెలుపలే రాయించడమంటే అసహ్యకరమైన విషయమే. ఈ తీరుపై విద్యార్థినిపై మానసిక ఒత్తిడిని తీసుకొచ్చినట్లు పలువురు పేర్కొంటున్నారు.
తల్లి ఆగ్రహం – యాజమాన్యాన్ని నిలదీత
ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థిని తల్లి తీవ్రంగా స్పందించారు. వెంటనే స్కూల్‌కి చేరుకుని ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు. తమ బిడ్డను ఇలా అందరి ముందూ అవమానపరిచే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. విద్యార్థినిపై మానసికంగా ఒత్తిడి కలిగేలా ప్రవర్తించడమే కాకుండా, విద్యా హక్కును కూడా హరిస్తున్నారని చెప్పారు. అనంతరం ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల ఆగ్రహం
ఈ అమానుష ఘటనపై సమాచారం బయటకు వచ్చాక, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 21వ శతాబ్దంలోనూ ఈ విధమైన పిచ్చి ఆచారాలు, అవగాహన లేకపోవడం తల్లి, బాలికకు ఇబ్బందికరంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఓ ప్రిన్సిపల్ స్థాయి వ్యక్తి ఇలా ప్రవర్తించడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పీరియడ్స్ విషయంలో అవగాహన పెంచాల్సిన బాధ్యత కలిగిన విద్యా సంస్థలే ఇలా వ్యవహరించడం దారుణమని విస్తుపడుతున్నారు.