సినిమా హాళ్లలోనో లేకపోతే టీవీల్లోనే ఈనో ప్రకటన వస్తుంది. భోజనం చేసిన తర్వాత వచ్చే కడుపులో మంటని ఈనో తగ్గిస్తుందని ఆ ప్రకటనల సారాంశం. ఆ ప్రకటలను ఈనో తయారు చేసే కంపెనీ ఇస్తుంది. అందు కోసం చాలా ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడు ENO కంపెనీ ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా భారీగా ప్రచారం పొందుతోంది. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా పోస్టర్లు, హోర్డింగులు రాత్రికి రాత్రి వెలిశాయి. వీటిని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాజకీయాల వల్ల కడుపులో మంటను తగ్గించే ఈనో ప్యాకెట్లకు ప్రీ పబ్లిసిటీ వస్తోంది. ఏకంగా హోర్డింగులు పెట్టేశారు. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్న ఎంవోయూలు అన్నీ ఫేక్ అనిబీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో చేసిన వాటి కన్నా ఎక్కువ ఎంవోయూలు చేసుకున్నామని కడుపు మంటతో ఈ విమర్శలు చేస్తున్నారని ఈనో వాడాలంటూ కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. ప్రెస్మీట్లలో ఈనో ప్యాకేట్లు చూపించారు. తర్వాత ఈనో ప్యాకెట్లను బీఆర్ఎస్ నేతలకు పంపుతున్నట్లుగా ప్రకటనలు చేశారు. అంత వరకూ బాగానే ఉంది.. కానీ తెల్లారేసరికి హోర్డింగులు పెట్టేశారు.ఇందులో ఈనోను చాలా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి నిజంగానే ఈనోకు ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఇలాంటి పోస్టర్లు, హోర్డింగ్ వల్ల ఈనోకు ప్రచారం వస్తుంది. కానీ ఇలాంటి ప్రచారాన్ని ఆ కంపెనీ కోరుకుంటుందా లేదా అన్నది తెలియదు. ఇష్టం లేకపోతే ఆ కంపెనీ కాంగ్రెస్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. తమ బ్రాండ్ ను రాజకీయంగా ఉపయోగించుుకుంటున్నారని విమర్శించవచ్చు.