ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు (Free RTC bus) ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ ‘జీరో ఫేర్’ టికెట్ పథకం వచ్చే ఆగస్టు 15నుండి అమల్లోకి రానుంది. సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) ఇందుకు సంబంధించిన అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ టికెట్‌లో మహిళ ప్రయాణికురాలికి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించిందో, ఎంత దూరం వెళ్లిందో వివరాలు ఉండనున్నాయి. ఉచిత ప్రయాణం వల్ల ఆమెకు ఎంత డబ్బు ఆదా అయిందో కూడా టికెట్‌లో చూపనున్నారు. ప్రభుత్వం 100 శాతం రాయితీ ఇస్తున్నదన్న విషయాన్ని కూడా టికెట్‌పై ముద్రించాలని సీఎం సూచించారు.

సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్న ఆదేశం
ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన సాంకేతిక వ్యవస్థ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మహిళల ప్రయోజనం కోసం ఈ టికెట్ ఎంతో సౌలభ్యం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. టికెట్ రూపంలో ఆమె లబ్ధి తనకే కనిపించేలా ఉండటం ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు పథకాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. వాటి ప్రభావాలు, ఆర్థిక భారం, నిర్వహణ మార్గాలను విశ్లేషించారు. ఏపీ పథకం బలంగా ఉండాలంటే ఏం చేయాలో అధికారులతో చర్చించారు.
ఆర్టీసీని లాభాల దిశగా తీసుకెళ్లాలి
పథకాన్ని అమలు చేస్తూనే ఆర్టీసీని నష్టాల్లోనుంచి లాభాల దిశగా నడిపించాలని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ఆదాయ మార్గాలు పెంచాలి, వ్యయాన్ని తగ్గించాలి, అప్పుల భారం తగ్గించాలి అని సూచించారు. ఆర్టీసీ భవిష్యత్తును స్వయం సమృద్ధిగా మార్చే దిశగా విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేయాలని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ మోడళ్లుగా మార్చాలని చెప్పారు. దీనివల్ల నిర్వహణ వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అవసరమైన విద్యుత్‌ను రాష్ట్రం స్వయంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. అన్ని ఆర్టీసీ డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
Read Also : Pulasa Fish : రూ.22 వేలు పలికిన పులస చేప!