Cabinet : సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ మంత్రివర్గ విస్తరణపై చర్చ తెరపైకి వస్తుంది. తాజాగా సోమవారం సాయంత్రం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో వీరు సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణ ప్రధాన అజెండాగా సమావేశం జరిగినట్లు తెలిసింది.

సర్కార్ కొలువుదీరి ఏడాదిన్నర గడిచినా..
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో కొలువుదీరిన తర్వాత.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా..ఆయనతో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ మంత్రివర్గంలో మెుత్తం 18 మంత్రి పదవులకు ఛాన్స్ ఉండగా.. ఆరు ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోంశాఖతో పాటు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ &అర్బన్ డెవలప్‌మెంట్, విద్య, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. సర్కార్ కొలువుదీరి ఏడాదిన్నర గడిచినా.. ఆరు ఖాళీలను భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయా శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రస్తుతానికి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ఆ తర్వాత మరో ఇద్దరిని తీసుకోనున్నట్లు సమాచారం. అయితే మంత్రి పదవుల రేసులో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా.. ప్రముఖంగా కొందరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి.
మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌కు అవకాశం
కుల, సామాజిక, రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొత్తవారికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ బలమైన ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెర్త్ కన్ఫార్మ్ అయినట్లు తెలిసింది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో ఉండగా.. మంత్రివర్గ హామీతోనే పార్టీలో చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్న విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే జి.వివేక్‌ను సైతం మంత్రివర్గంలోకి
చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్‌ను సైతం మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ఆయన కూడా మంత్రి పదవి ఆఫర్‌తోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరినట్లు తెలిసింది. ఆ హామీ మేరకు ఆయనకు పదవి పక్కా అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదు. దీంతో జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మేరకు సీఎం అధిష్ఠానం వద్ద ఆయన పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. కాగా, ఏఐసీసీ పెద్దలతో భేటీ అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మంత్రి వర్గం విస్తరణపై చర్చ జరిగిందని.. త్వరలోనే భర్తీ ఉంటుందన్నారు. ఉగాది లేదా అంతకన్నా ముందే పదవుల భర్తీకి ఛాన్స్ ఉన్నట్లు ఆయన ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు.