మదనపల్లె(Madanapalle)లోని బెంగళూరు బస్టాండ్ వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ఓ దాడి ఘటన కలకలం రేపుతోంది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా (Nawaz Basha) తన అనుచరులతో కలిసి ఓ ప్రైవేట్ బస్సు కండక్టర్‌పై దాడికి పాల్పడటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వివరాల ప్రకారం, దొనబైలు ప్రాంతానికి చెందిన హరినాథ్ అనే యువకుడు మధుసూదన ట్రావెల్స్‌కి చెందిన బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన బస్సు బెంగళూరు నుంచి మదనపల్లె వస్తుండగా, అదే రూట్‌లోని మాజీ ఎమ్మెల్యేకు చెందిన బస్సును పలు మార్లు ఓవర్టేక్ చేశాడనే కోపంతో ఈ దాడి చోటు చేసుకుంది.
హరినాథ్‌ను కొట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
ప్రమాదకరంగా మారిన ఈ సంఘటన మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జరిగింది. బస్టాండ్‌లో ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలోనే నవాజ్ బాషా తన అనుచరులతో కలిసి హరినాథ్‌ను కొట్టారు. “నా బస్సు కంటే ముందు ఎందుకు వస్తున్నావు?” అని అడుగుతూ తీవ్రంగా దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనలో గాయపడిన హరినాథ్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడి, ఆయనతో పాటు దాడిలో పాల్గొన్నవారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్ర వెల్లడించారు.
ఈ ఘటన తో ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య ఉన్న అసహన వాతావరణం
ఈ ఘటనపై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధులుగా బాధ్యత వహించిన వ్యక్తులే ఈ విధంగా ప్రవర్తిస్తే ఎలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ద్వారా ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య ఉన్న అసహన వాతావరణం ఒక్కసారి మరోసారి బయటపడింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు రోజూ వందల బస్సులు నడుస్తుండగా, రూట్లు, టైమింగ్‌లపై పోటీ పెరిగిన పరిస్థితుల్లో ట్రావెల్స్ మధ్య పోటీ క్రమంగా వివాదాలకు దారి తీస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి సంఘటనలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Read Also : HYD-Metro : హైదరాబాద్ మెట్రో నిర్వహణపై నెటిజన్ల ఫైర్