అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో విచారణకు ఆయన వచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు గోరంట్ల మాధవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాధితుల వివరాలు వెల్లడించారంటూ గతేడాది నవంబర్ 2న చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్‌లో పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు.

50కిపైగా వాహనాల భారీ కాన్వాయ్‌తో
కాగా, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను బుధవారం విచారణ నిమిత్తం విజయవాడ రావాలని కొద్దిరోజుల కిందట పోలీసులు 41ఏ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. బెజవాడ వెళ్తున్నట్లు బుధవారం ఆయన భారీ బిల్డప్ ఇచ్చారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అనంతపురంలోని మాధవ్ ఇంటికి చేరుకున్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా వారిలో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 50కిపైగా వాహనాల భారీ కాన్వాయ్‌తో మాధవ్ నగరంలో బలప్రదర్శన చేశారు. వైఎస్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సంఘీభావం తెలుపడానికే వైసీపీ నాయకులు
అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు విచారణకు హాజరవుతానని.. తనకు వేరే కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో.. గురువారం వస్తానని చెప్పానని తెలిపారు. ‘బలప్రదర్శనతో వెళ్తున్నారా..? విజయవాడకు వెళ్లేందుకు ఒకట్రెండు రోజులు పడుతుందా..’ అని మీడియా ప్రశ్నించగా… తాను విచారణకు వెళ్తున్నాననే సమాచారంతో సంఘీభావం తెలుపడానికే వైసీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చారని బదులిచ్చారు. విజయవాడ పోలీసులు తనకు నోటీసులు అందజేసిన రోజు ‘అంతర్యుద్ధం వస్తుంది’ అని తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.