టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడిగా, మాజీ ఎమ్మెల్యేగా సేవలందించిన పల్లా సింహాచలం (93) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టీడీపీ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. పల్లా సింహాచలం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రిగా రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి.
ప్రజల మన్ననలు పొందిన నేత
సింహాచలం 1994లో విశాఖపట్నం-2 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సేవలందించారు. తన పదవీకాలంలో నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన, ప్రజల మన్ననలు పొందారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి, సామాజిక సేవలకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందారు. విశాఖలో ఆయన వేశిన అభివృద్ధి పునాదులు ఇప్పటికీ ప్రజల గుర్తుల్లో ఉన్నాయి.
పార్టీ నేతలు సంతాపం
పల్లా సింహాచలం మృతిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీకి, కుటుంబానికి తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ప్రార్థించారు. పలువురు పార్టీ నేతలు, అభిమానులు సింహాచలం నివాసానికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు.
Read Also : Akhil Akkineni : ఘనంగా ముగిసిన అఖిల్ అక్కినేని వివాహం