ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను తగలబెట్టిన ఘోర ఘటన
1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది. ముఖ్యంగా నవంబర్ 1, 1984న ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను తగలబెట్టిన ఘోర ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు కోర్టు నిర్ధారించింది. దీనిపై వాదనలు పూర్తయిన అనంతరం కోర్టు ఈ తీర్పును ప్రకటించింది.
ఈ కేసులో శిక్ష ఖరారు చేయడం కోసం ఫిబ్రవరి 18న తదుపరి వాదనలు విననున్నట్లు కోర్టు తెలిపింది. నేరం తీవ్రతను బట్టి ఆయనకు గరిష్ఠ శిక్ష విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1984లో ప్రధాని ఇంద్రా గాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న అల్లర్లు వేలాది సిక్కుల ప్రాణాలను బలితీసుకున్నాయి. అందులో ఈ కేసు కూడా ఒక భాగంగా నిలిచింది. ఇది తొలి సారి కాదు, గతంలో కూడా సజ్జన్ కుమార్ పై వివిధ ఘటనలకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగిన మరో సిక్కుల ఊచకోత కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా సరస్వతీ విహార్ ఘటనలోనూ కోర్టు ఆయనను దోషిగా తేల్చడంతో, ఆయనపై మరిన్ని శిక్షలు పడే అవకాశముంది.

సిక్కుల ఊచకోత కేసులో న్యాయస్థానం తీసుకున్న నిర్ణయాన్ని బాధిత కుటుంబాలు స్వాగతించాయి. దశాబ్దాలుగా న్యాయం కోసం పోరాడుతున్న వారు, ఇలాంటి తీర్పులు బాధితులకు కొంత ఊరటనిస్తాయని పేర్కొన్నారు. అయితే, నిందితులకు గరిష్ఠ శిక్ష విధించాలి, బాధితులకు పూర్తి న్యాయం చేయాలి అంటూ పలువురు సిక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.మొత్తం మీద, ఈ కేసులో కోర్టు తీర్పు మరో కీలక మలుపుగా మారింది. దేశ చరిత్రలో మోసపూరిత ఘట్టంగా నిలిచిన 1984 సిక్కుల ఊచకోత ఘటనపై న్యాయపరంగా ఇంకా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి.