Jagadish Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పై ఈనెల 27 వరకు బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకుండా వేటు పడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సోమవారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. దీంతో సభ లోపలికి వెళ్లకుండా జగదీశ్ రెడ్డిని చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రావొద్దనడానికి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయని ప్రశ్నించారు.

ప్రభుత్వ అరాచకత్వానికి ఇది పరాకాష్ట
నన్ను ఏ కారణంతో సస్పెండ్ చేశారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. సస్పెండ్ చేశారో, లేదో కనీసం ఆధారాలు లేవు. బులెటిన్ ఇస్తే నేను రాను. లేదంటే సభాపతిని కలుస్తా. నేను కోర్టుకు వెళ్తానన్న భయంతో బులెటిన్ ఇవ్వట్లేదు. ఎలాంటి రాజ్యాంగ విలువలు, నిబంధనలు పాటించకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అరాచకత్వానికి ఇది పరాకాష్ట. మంత్రులు జవాబివ్వలేక .. ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. దావత్‌లకు కూడా మంత్రులు ప్రభుత్వ హెలికాప్టర్లలో వెళ్తున్నారు అని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు.