తెలంగాణలో గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) తో తొలి మరణం సంభవించింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన 25ఏళ్ల వివాహిత ఈ వ్యాధికి బలైంది. నెలరోజుల క్రితం నరాల నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆమెకు వైద్యులు GBS గా నిర్ధారణ చేశారు.
ప్రారంభంలోనే స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ, లక్షణాలు తీవ్రమయ్యాయి. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగించినా మెరుగైన ఫలితాలు లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి మార్చారు. భారీగా వైద్యం ఖర్చు చేసినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు.

నెల రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె నిన్న మృతిచెందింది. GBS కారణంగా రాష్ట్రంలో ఇది తొలి మరణంగా నమోదైంది. ఈ వ్యాధి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించి పక్షవాతం, నరాల నష్టం కలిగించడంతోపాటు తీవ్రమైన జబ్బులకు దారితీస్తుంది. మధుమేహం, అనారోగ్యంతో బాధపడేవారికి ఇది ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది.
GBS విషయంలో ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మొదట్లో మెల్లగా ప్రారంభమయ్యే నరాల నొప్పులు, చేతులు, కాళ్ల నిస్సత్తువను గుర్తించి తక్షణమే వైద్య సాయం తీసుకోవాలని చెబుతున్నారు. ఈ వ్యాధి గుర్తించిన తొలి దశలోనే సరైన చికిత్స అందితే ప్రాణాలను కాపాడుకోవచ్చని అంటున్నారు.
తెలంగాణలో ఇటువంటి మరణాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఈ వ్యాధిపై అవగాహన పెంచుకుని, చిన్న లక్షణాలైనా కనిపించిన వెంటనే వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.