తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన అర్హులైన కుటుంబాల్లో సంతోషం నింపింది. రాష్ట్ర వ్యాప్తంగా 531 గ్రామాల్లో ఈరోజు మొదటి రోజు 15,414 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసింది. ఈ కార్డుల ద్వారా 51,912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. ఇది ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ఒక ప్రధాన భాగంగా నిలిచింది. పాత రేషన్ కార్డుల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేయడం ద్వారా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 1,02,000 మంది కార్డుదారులు తమ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలని దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు 1,03,674 మంది కొత్త సభ్యులను పాత కార్డుల్లో నమోదు చేసి, వచ్చే నెల నుంచి వారికి రేషన్ అందించే ఏర్పాట్లు చేపడుతోంది.

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కూడా ప్రభుత్వం దశలవారీగా నిర్ణయాత్మకంగా పనిచేస్తోంది. గూడు లేని నిరుపేదలకు తొలి రోజు 72,000 మందికి ఇండ్ల పత్రాలను అందజేసింది. ఈ పథకం ద్వారా నిరుపేదల జీవన స్థాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిరుపేదల కోసం తీసుకుంటున్న ఈ చర్యలతో ప్రభుత్వం సామాజిక సమానత్వం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల పత్రాలు అందించడం ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ముందంజ వేస్తోంది.
తెలంగాణ ప్రజలకు మంచి సేవలను అందించడానికి ప్రభుత్వం తహతహలాడుతోంది. నూతన పథకాలను అమలు చేసి ప్రతి గ్రామం, ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.