హైదరాబాద్ : కేపీహెచ్‌బీ కాలనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ టిఫిన్ సెంటర్‌లో అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 2 బైకులు, హోటల్ ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు కనుమ పండుగ వేళ ఖమ్మం పత్తి మార్కెట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి మార్కెట్ యార్డ్ షెడ్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో షెడ్‌లో నిల్వచేసిన పత్తి బస్తాలు తగలబడిపోయాయి. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే ఈ అగ్నిప్రమాదంలో మర్కెట్ గోడౌన్‌లో ఉంచిన 400 పత్తి బస్తాలు మంటల్లో దగ్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే పత్తి మార్కెట్‌కు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 16 వరకు సెలవులు ఉన్నాయి. పండుగకు ముందు కొందరు వ్యాపారులు రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి మార్కెట్ యార్డులో ఉంచారు. కానీ ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో పత్తి బస్తాలు కాలిపోవడంతో వ్యాపారులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.
అగ్నిప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో పత్తి బస్తాలు దగ్ధమైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం జరగడంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు తమను ప్రభుత్వం ఆదుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు.