హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన పై ఫోకస్ చేసింది. ఇప్పటికే కులగణన పూర్తి అయిన నేపథ్యంలో ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్ ను అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. బీసీ రిజ్వేషన్ల పెంచాలని కోరుతూ కేంద్రానికి అప్పీలు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వే ఇప్పటికే పూర్తిగా అధికారులు ఫైనల్ రిపోర్టును రెడీ చేశారు. దానిపై ఫిబ్రవరి 5న మంత్రివర్గం భేటీ కానుంది.

తర్వాత అసెంబ్లీ సాక్షిగా కలగణనకు అమోదముద్ర తెలిపేందుకు ఫిబ్రవరి 7 నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. కులగణన నివేదికపై సభలో చర్చించి ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ కేబినెట్ భేటీలోనే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి.. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ప్లాన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు సమావేశంపై సీఎం ఇప్పటికి గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ప్రత్యేక సెషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది.