పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం సంభవించింది. మాలిలోని కౌలికోరో ప్రాంతంలో ఉన్న బంగారు గనిలో కొండచరియలు విరిగిపడడంతో 10 మంది మృతి చెందారు. పలువురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. బుధవారం ఈ ఘటన జరిగిందని అక్కడి గవర్నర్ కల్నల్ లామైన్ కపోరో సనొగో వెల్లడించారు. బంగారం వెతుకులాటకు వెళ్లి వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. గనిలోకి ఒక్కసారిగా బురద నీరు ప్రవేశించి వారిని చుట్టిముట్టింది. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకునిపోయారని, వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని గవర్నర్ తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గని కూలడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.

ఆఫ్రికా దేశాల్లో మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా ఉన్న మాలిలో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. గతేడాది కూడా ఇదే ప్రాంతంలోని కంగబా జిల్లాలో బంగారు గని కుప్పకూలి.. 70 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఎలాంటి భద్రతా చర్యలను పాటించకుండా అక్రమ మైనింగ్ కు పాల్పడుతుండడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మైనింగ్ రంగంలో చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ భారీ ప్రమాదంపై ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది.