మీ ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోండి..లేదంటే ఇబ్బందులు
న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించిన నిబంధనలు మార్చింది. ముఖ్యంగా బ్లాక్ లిస్ట్‌లో ఉన్న ఫాస్టాగ్‌ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఫాస్టాగ్ బ్యాలెన్సు ధ్రువీకరణకు సంబంధించి రెండు ముఖ్యమైన మార్పులు చేసింది. ఈ రెండు విషయాలను వాహనదారులు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే టోల్ ప్లాజాల వద్ద ఎర్రర్ కోడ్ 176 చూపే పరిస్థితి వస్తుంది. ఇది ఫాస్టాగ్ ద్వారా మీ టోల్ చెల్లింపులను తిరస్కరణకు దారి తీస్తుంది. ఒక్కోసారి రెండింతలు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

కొత్త రూల్స్ ఇవే..
ఫాస్టాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించి జనవరి 28, 2025 రోజున నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఓ సర్క్యూలర్ జారీ చేసింది. దీని ప్రకారం.. రీఛార్జ్ ట్రాన్సాక్షన్లు టోల్ ప్లాజా వద్ద రీడర్ చదివే సమయం, తక్కువ బ్యాలెన్స్ లేదా బ్లాక్ లిస్ట్ కింద ట్యాగ్ ఉంచబడిన సమయం ఆధారంగా ధ్రువీకరించనున్నారు. రీడర్ రీడ్ టైమ్‌కు 60 నిమిషాల ముందు వరకు, రీడర్ రీడ్ టైమ్ తర్వాత 10 నిమిషాల వరకు యాక్టివ్‌గా లేని ట్యాగ్‌లపై రీఛార్జ్ ట్రాన్సాక్షన్లు రీజన్ కోడ్ 176తో తిరస్కరించబడతాయి. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 17, 2025 నుంచే అమలులోకి వస్తాయి.
కేవైసీ అప్డేషన్ పెండింగ్
రెండు రకాల వెహికల్స్ ఉంటాయి. వైట్ లిస్టెడ్ వెహికల్స్, బ్లాక్ లిస్టెడ్ వెహికల్స్. తక్కువ బ్యాలెన్స్ ఉండడం, కేవైసీ అప్డేషన్ పెండింగ్‌లో ఉండడం, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్ సరిపోలకపోవడం వంటి కారణాలతో బ్లాక్ లిస్టులో పెడతారు. ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులో పడితే వాహనదారులకు 70 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. వినియోగదారు టోల్ ప్లాజా వద్దకు వచ్చినప్పుడు 60 నిమిషాలకు పైగా హాట్ లిస్ట్ లేదా మినహాయింపు జాబితాలో ట్యాగ్ ఉండి, వెళ్లిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు లిస్టులో ఉండిపోయినప్పుడు మాత్రమే ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్ తిరస్కరించబడుతుంది. లేకపోతే ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అవుతుంది.