Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ నకిలీ వైద్యుడి నిర్వాకం వల్ల ఒకే నెలలో ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. ఎన్ జాన్ కెమ్ అనే గుండె వైద్య నిపుణుడు దమోహ్ పట్టణంలో ప్రైవేటు మిషనరీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద శస్త్రచికిత్స చేయించుకున్న ఏడుగురు రోగులు వారం వ్యవధిలో మరణించినట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్న సమయంలో అసలు అతడు వైద్యుడే కాదని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎన్ జాన్ కెమ్ అనే ఓ ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడి పేరు వాడుకొని అతడు కార్డియాలజిస్టుగా చలామణి అవుతున్నట్లు తెలిపారు.ః

నకిలీ పత్రాలు సృష్టించుకొని వైద్యుడిగా
జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ.. నిందితుడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని తెలిపారు. అతడు చేసిన ఆపరేషన్లకు ఆస్పత్రికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం నుంచి డబ్బు కూడా అందుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు బ్రిటన్‌లోని ప్రసిద్ధ వైద్యుడి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించుకొని వైద్యుడిగా కొనసాగుతున్నాడని అన్నారు. హైదరాబాద్‌లోనూ అతడిపై పలు కేసులు నమోదయినట్లు గుర్తించామన్నారు. మృతులు ఏడుగురు అని బాధితులు చెప్తున్నప్పటికీ ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
Read Also: రేపు అయోధ్యలో అద్భుత ఘట్టం.. రామయ్య నుదుటిపై సూర్య తిలకం