అమరావతి: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించడం ద్వారా ప్రధాని మోడీపై విశ్వాసం మరోసారి రుజువైందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ విజయంపై స్పందిస్తూ.. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలిచేలా మోడీ పాలన సాగిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఢిల్లీలో సమ్మిళిత అభివృద్ధి అని అన్నారు.

ప్రధాని మోడీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు. ఈ విజయం దేశాభివృద్ధికి శుభసూచకమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఢిల్లీలో సమగ్ర అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువవుతాయన్నారు. ‘వికసిత సంకల్ప పత్రం’ ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నాయని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతుందని ఢిల్లీ ప్రజలు నమ్మకంతో ఓటు వేశారని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయానికి ప్రధాన కారణమైన నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ నేతలు, మిత్రపక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశేష విజయాన్ని సాధించింది. 70 స్థానాలున్న ఈ ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాల్లో గెలుపొందగా, ఆమ్ ఆద్మీ పార్టీ 23 స్థానాలకే పరిమితం అయింది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలాంటి విజయం సాధించలేదు.