న్యూయార్క్: అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం(F-35 Crash) కుప్పకూలింది. ఈ ఘటన అలస్కాలోని ఎలిసన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ ఘటన జరిగింది. ఆకాశంలో విన్యాసం చేస్తున్న సమయంలో.. ఒక్కసారిగా ఎఫ్-35 కిందకు జారింది. విమానాశ్రయ రన్‌వేపై పడి పేలిపోయింది. ఆ సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. రన్‌వేపై కూలడంతో జెట్ పూర్తిగా ధ్వంసమైంది.
ఆ యుద్ధ విమానంలో ఉన్న పైలెట్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు. అతన్ని బాసెట్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎయిర్ బేస్ పరిధిలోనే ఈ ప్రమాదం జరగడంతో.. అధికారులు వెంటనే స్పందించగలిరారు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇక, విమానం కూలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు సాంకేతిక నిపుణులు. ఈక్రమంలోనే ఎఫ్-35 యుద్ధ విమానంలోని శకలాలను పరిశీలిస్తున్నారు. కానీ విమానంలోని ఎక్కువ భాగాలు కాలిపోవడంతో.. ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. పైలెట్ కోలుకుంటే తప్ప ఈ ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందో తెలిసేలా లేదు.
కాగా, అమెరికాలో F-35 విమానం గగనతలంలో కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు. టెక్సాస్ నుండి లాస్ ఏంజిల్స్ సమీపంలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు వెళుతున్న F-35 ఫైటర్ జెట్.. మే 2024లో న్యూ మెక్సికోలో ఇంధనం నింపుకోవడానికి పైలట్ ఆపేందుకు ప్రయత్నించగా.. కుప్పకూలిపోయింది. తీవ్ర గాయాలపాలైన పైలట్‌ను ఆస్పత్రికి తరలించారు. మరో యుద్ధ విమానం 2023 సెప్టెంబర్‌లో సౌత్ కరోలినాలో కూలిపోయింది.