Rajeev Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం పథకం గుడువును ఏప్రిల్ 14 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇది వరకు షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 4 వరకు ఉండగా.. పలువురి విజ్ఞప్తి మేరకు పొడిగించినట్టు సమాచారం. ఈ పథకంలో భాగంగా 5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల రునాలను 60 నుంచి 80 శాతం వరకు రాయితీతో ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు లేదా ఇన్‌కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫొటో అవసరం. వెబ్‌సైట్ https://tgobmms.cgg.gov.in/ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం
వ్యవసాయేతర పథకాలకు వయసు 21 – 55 మధ్య ఉండాలి. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది. రూ.50 వేల యూనిట్లకు 100 శాతం సబ్సిడీ, రూ.50 వేల నుంచి రూ.లక్ష మధ్య యూనిట్లకు 90 శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.80 శాతం, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ అందిస్తారు. మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ల ద్వారా ప్రభుత్వం సమకూరుస్తుంది.
పథకాన్ని పకడ్బందీగా అమలు
రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ-1 కింద రూ. 1 లక్ష, కేటగిరీ-2 కింద రూ. 2 లక్షలు, కేటగిరీ-3 కింద రూ. 3 లక్షల రుణాలను అందజేయనుండగా, వరుసగా 80 శాతం, 70 శాతం, 60 శాతం రాయితీ లభిస్తుంది. ఈ పథకం అమలు తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.