జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. “జయకేతనం” పేరుతో నిర్వహించే ఈ సభ శుక్రవారం పిఠాపురం మండలం, చిత్రాడ గ్రామంలోని ఎస్‌బి వెంచర్ వద్ద జరగనుంది.సభ ప్రాంగణం భవ్యంగా అలంకరించబడింది. వేదిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే, ఇతరత్రా ఏర్పాట్లు కూడా వేగంగా సాగుతున్నాయి. సభకు వచ్చే అభిమానులు, కార్యకర్తల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని, పెద్ద ఎత్తున పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తెచ్చారు.ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీరు, మజ్జిగ, ఇతర తాగునీటి వసతులను ఏర్పాటు చేశారు. అలాగే, భోజన సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచారు.

సభలో పాల్గొనే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, అత్యవసర సేవల కోసం 14 అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు.భద్రతా పరంగా 1600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 75 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచుతున్నారు.
అదనంగా రోడ్డుకు ఇరువైపులా మరియు సభ ప్రాంగణంలో భారీ ఎల్‌ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి సభను ప్రత్యక్ష ప్రసారం చేసే ఏర్పాట్లు చేశారు.సాయంత్రం జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకొని ప్రసంగించనున్నారు.భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు,అభిమానులు సభకు హాజరయ్యే అవకాశముంది.సభను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కాకినాడ-కత్తిపూడి మధ్య గల 216వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. సభకు హాజరయ్యే వారికి ఎక్కడికక్కడ మంచినీరు, మజ్జిగ వంటివి అందించేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేశారు.సర్వం సిద్ధంగా ఉండటంతో జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు? రాష్ట్ర రాజకీయాలపై ఆయన ఏమి అభిప్రాయపడతారు? అనే ఆసక్తి అధికంగా ఉంది.
అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పవన్ స్పందించనున్నారా? ఎన్నికల వ్యూహంపై సంకేతాలు ఇస్తారా? అన్నది జనసేన అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. పవన్ ప్రసంగం రాజకీయ దిశను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జనసైనికులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏమి ప్రకటిస్తారో చూడాలి!