ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయం(AP State Secretariat)లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు స్మార్ట్ కార్డ్ ఎంట్రీ సిస్టమ్ అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే వారం నుంచే ఈ నూతన విధానం ప్రారంభం కానుంది. సచివాలయంలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి క్యూఆర్ కోడ్ ఉన్న ప్రత్యేక స్మార్ట్ కార్డు అందజేయనున్నారు. ఈ కార్డుల ద్వారానే ఇకపై ఉద్యోగులు లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది.
వాహనాల కోసం టోల్‌గేట్ తరహా స్కానింగ్ విధానం
కేవలం వ్యక్తిగత గుర్తింపు కార్డులే కాకుండా, సచివాలయ ప్రాంగణానికి వచ్చే వాహనాలపై కూడా సురక్షిత పద్ధతులు అమలు చేయనున్నారు. మెయిన్ గేట్ వద్ద టోల్‌గేట్ తరహా టెక్నాలజీ (Smart Card ) ఉపయోగించి వాహనాల నంబర్లను స్కాన్ చేసి ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నారు. దీనివల్ల అనవసర రాకపోకలపై నియంత్రణ ఉండడంతో పాటు, సచివాలయం ప్రాంగణం మరింత భద్రమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
వివరాల సేకరణ ఇప్పటికే ప్రారంభం
ఈ స్మార్ట్ కార్డ్ సిస్టమ్ అమలుకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వారి వాహనాల వివరాల సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. భవిష్యత్తులో ఈ విధానాన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా విస్తరించే అవకాశాలున్నాయని సమాచారం. సాంకేతికత ఆధారంగా నిర్వహణ పెంచుతూ, భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్న ఈ కొత్త మార్గదర్శకాలు పాలనలో ఆధునికతను ప్రతిబింబిస్తున్నాయి.
Read Also : Srisailam Dam Gates : రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న సీఎం చంద్రబాబు ?