న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం 22 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలైన మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్, సౌరభ్ భరద్వాజ్ ఓటమి పాలయ్యారు. కీలక నేతల్లో సీఎం ఆతిశీ ఒక్కరే గెలుపొందారు. కల్కాజీ స్థానం నుంచి ఆమె సమీప ప్రత్యర్థిపై స్వల్ప తేడాతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో గెలుపు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే అని.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో నేను గెలిచాను. కానీ సెలబ్రేట్ చేసుకునే సమయం కాదు. నాపై విశ్వాసం ఉంచి గెలిపించిన కల్కాజీ ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది అని అన్నారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ బీజేపీ ఘన విజయం సాధించింది. 12 ఏళ్ల ఆమాద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు. తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 23 స్థానాల్లో ఆప్ పార్టీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా , మంత్రులు ఘోర ఓటమి చవిచూశారు.