కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అంటే 2024-25కు సంబంధించి ఆర్ధిక సర్వేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. తొలుత లోక్ సభలో అనంతరం రాజ్యసభలో ఆమె ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. అయితే ఆర్ధిక వ్యవస్థ మందగమన పరిస్ధితుల్లో వచ్చే ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.3 శాతం నుంచి 6.8 శాతం మధ్యన ఉండొచ్చని అంచనా వేశారు.రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని ఆర్ధిక సర్వే తెలిపింది. సమీప-కాల అంతర్జాతీయ వృద్ధి ట్రెండ్ స్థాయి కంటే కొంచెం తక్కువగనే మన ఆర్ధిక వృద్ధి ఉంటుందని ఈ సర్వే అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో వాణిజ్య దృక్పథం స్తబ్దుగానే ఉంటుందని ఇందులో అంచనా వేశారు. అలాగే దేశీయంగా, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం వినియోగానికి మంచి సూచనగా చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరి 6.4 శాతంగా అంచనా వేశారు. ఇది బలహీనమైన తయారీ, పెట్టుబడి పనితీరుకు సంకేతంగా భావిస్తున్నారు. ఇది గత ఏడాది వృద్ధి అంచనా 6.5-7 శాతం ఆర్బీఐ అంచనా అయిన 6.6 శాతం కంటే తక్కువే.

మరోవైపు వ్యవసాయం, అనుబంధ రంగాలు ఈ ఆర్ధిక సంవత్సరంలో దేశ జీడీపీలో 16 శాతం వాటాకు చేరుకున్నట్లు ఆర్ధిక సర్వే తెలిపింది. రుణ సదుపాయాన్ని మెరుగుపరచడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, సాంకేతికతను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించి, రైతు ఆదాయాలను పెంచడానికి, వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్రం వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని సర్వే వెల్లడించింది. చిన్న, సన్నకారు రైతులకు సులభంగా క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేస్తూ, కొలేటరల్-ఫ్రీ వ్యవసాయ రుణాల పరిమితిని లక్షా 60 వేల నుండి రూ.2 లక్షలకు పెంచడం ఓ కీలక నిర్ణయమని పేర్కొంది.