వేసవి కాలం రాకముందే బెంగళూరు వాసులు తాగేందుకు నీళ్లు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఈక్రమంలోనే ఎండల తీవ్రతను, నీటి సమస్యను దృష్టిలో పెట్టుకున్న కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. తాగు నీటితో కార్ వాష్, గార్డెనింగ్, భవన నిర్మాణం, రోడ్లను శుభ్రపరచడం, ఫౌంటేయిన్సు, వినోద ప్రయోజనాల కోసం, సినిమా హాళ్లు, క్లీనింగ్, వంటగదిలో పాత్రలు కడగడం వంటివి చేయడాన్ని నిషేధించింది.ఒకవేళ తమ మాట పట్టించుకోకుండా తాగు నీరు ఈ రకంగా వృథా చేస్తే,వాటర్ బోర్డు చట్టంలోని సెక్షన్ 109 ప్రకారం రూ.5 వేల జరిమానా విధిస్తామని కూడా ప్రకటించింది. తొలి సారి నిబంధనలు ఉల్లంఘించిన వారికి 5 వేల రూపాయలే జరిమానా విధిస్తామని.కానీ పదే పదే తప్పును పునరావృతం చేస్తే 500 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతామని బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల బోర్డు వెల్లడించింది.అంతేకాకుండా ఎవరైనా తాగు నీటిని వృథా చేస్తూ కంటపడితే 1916 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్ట్యా భూగర్భ జలాలు క్షీణించి నీటి సమస్య ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా బెంగళూరులో ప్రస్తుతం 1.40 కోట్ల జనాభా ఉందని.వారందరికీ సరిపడా నీళ్లు కావాలంటే ఏ ఒక్కరూ నీటిని వృథా చేయకూడదని వివరించింది.
గతేడాది కూడా ఇలాంటి సమస్యలే ఏర్పడగా.ఒక్క నీటి ట్యాంకర్ కోసం ప్రజలు 1500 రూపాయల నుంచి 6 వేల రూపాయల వరకూ చెల్లించాల్సి వచ్చిందని గుర్తు చేసింది. అలాగే పట్టణ వ్యాప్తంగా మొత్తం 16 వేల 781 బోర్ వెల్స్ ఉండగా.అందులో 7,784 మాత్రమే పని చేస్తున్నాయని చెప్పింది. మిగతా 6, 997 ఎండిపోయినట్లు వెల్లడించింది. మరోసారి ఇలాంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని.ప్రజలంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నీటిని వినియోగించాలని చెప్పుకొచ్చింది.

నీటి సంక్షోభం
నీటి కొరతను అదుపు చేయడానికి కర్నాటక ప్రభుత్వం వాటర్ రేషన్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ ట్యాంకర్ రేటు రూ. 750 నుంచి రూ. 1200కు పెంచగా, ప్రైవేట్ ట్యాంకర్ అయితే రూ. 6000 వరకు వసూలు చేస్తున్నారు. ఈ ధరలు దూరాన్ని బట్టి మరింత పెరిగే పరిస్థితి నెలకొంది.
భూగర్భ జలమట్టం
మంగళవారం నాడు బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఈమధ్య కాలంలో వర్షపాతం లేకపోవడంతో భూగర్భ జలాలు ఎండిపోయినట్లు సిటీ వాటర్ బోర్డు తెలిపింది. రాబోయే రోజుల్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు నీటిని వృథా చేయకుండా అవసరమైన మేరకే వాడుకోవాలని సూచించింది.