డీలిమిటేషన్ ప్రక్రియ అంశంపై ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండు పేజీల లేఖ రాశారు. లోక్‌సభ, రాజ్యసభలో ప్రాతినిథ్యం కోల్పోకుండా ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించాలని ఆయన కోరారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ, రాజ్యసభల్లో ఆయా రాష్ట్రాలకు సీట్లు తగ్గే పరిస్థితి రాకుండా చూడాలని పేర్కొన్నారు. 2026 జనగణన ప్రక్రియ ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియతో నష్టం కలుగుతుందన్న భావన దక్షిణాది రాష్ట్రాల్లో ఉందని అందులో స్పష్టం చేశారు.

ఆందోళన కలిగిస్తోంది : జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన చేసే నియోజకవర్గాల పునర్విభజన ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు. జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా 1971 నాటికి దిగజారిందని వచ్చే 15 ఏళ్లలో ఇది మరింత కనిష్ఠానికి చేరుతుందని జగన్ స్పష్టం చేశారు.
జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాదికి నష్టం
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అది ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని అన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై ఎక్స్‌లో పోస్ట్ చేసిన షర్మిల జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమేనని పేర్కొన్నారు. ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతతో పని లేకుండా పోతుందన్నారు. ‘సొమ్ము సౌత్ ది – సోకు నార్త్ ది’ అనే పరిస్థితి ఎదురువుతుందని ఆక్షేపించారు.
పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదు
డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లు పెరుగుతాయని అన్నారు. దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెరిగే సీట్లు కేవలం 49+41+54 = 144 సీట్లు మాత్రమేనని అన్నారు.