Donald Trump: పుతిన్ , జెలెన్ స్కీకి ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్ స్కీలకు కీలక సందేశాలు పంపిస్తూ, తన మాట వినకపోతే ఉపేక్షించేది లేదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.ట్రంప్ ప్రకటన ప్రకారం, యుద్ధం కొనసాగితే రష్యాపై భారీ సుంకాలు విధించనున్నట్లు హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో హింస ఆగకపోతే దాని పూర్తి బాధ్యత పుతిన్‌పై ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో, జెలెన్ స్కీకి కూడా గట్టి సందేశం పంపారు.

ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో చేరకూడదని, అదేవిధంగా అరుదైన ఖనిజాల ఒప్పందం నుంచి వెనుకడుగేస్తే ఉక్రెయిన్‌కు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందించారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాలు సుదీర్ఘ ప్రక్రియ అని ఆయన అభివర్ణించారు. ట్రంప్ వ్యాఖ్యలపై నేరుగా స్పందించకపోయినా, అమెరికా అధ్యక్షుడితో చర్చించేందుకు పుతిన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు.”ఉక్రెయిన్ సమస్యపై కొన్ని ఆలోచనలు కొనసాగుతున్నాయి, కానీ ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది చాలా సంక్లిష్టమైన విషయం, అందుకే దీని పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టొచ్చు” అని పెస్కోవ్ అన్నారు. అమెరికాతో చర్చల విషయంలో పుతిన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ట్రంప్‌తో మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.